పట్టణ ప్రగతి’ కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధ్ది అయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో దాదాపు రూ. 80లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కీసర మండల పరిధిలోని నాగారం మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులోని శిల్పానగర్ కాలనీ కార్యాలయ భవన నిర్మాణం రూ.6లక్షలు, 7వ వార్డు శిల్పానగర్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం రూ.3లక్షలతో నిర్మాణ పనులకు మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఘట్‌కేసర్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద్ద చైర్మన్ ముల్లిపావనీజంగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఇప్పటి వరకు పంచాయతీ విధానంలో ఉన్న ఘట్‌కేసర్ ప్రస్తుతం నాలుగు గ్రామాలతో కలిపి మున్సిపాలిటీగా ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం నూతనంగా రూపొందించిన కొత్త మున్సిపల్ చట్టంతో భారీగా నిధులు వస్తాయని, దీంతో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉందన్నారు.