రాజధాని హైదరాబాద్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓరుగల్లులో ఐటీ రంగాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ పరిశ్రమలు ఒక్కొక్కటిగా ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. ఆదివారం మడికొండలోని టీఎస్‌ఐఐసీకి చెందిన ఐటీ పార్కులో క్వాడ్రంట్ రిసోర్స్ ఐటీ కంపెనీకి చెందిన డెలివరీ సెంటర్‌కు భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతితోపాటు అతిథులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం క్వాడ్రంట్ ఐటీ కంపెనీ సీఈవో కంచరకుంట్ల వంశీరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ప్రముఖ ఐటీ కంపెనీలు సైయెంట్, టెక్ మహీంద్ర కంపెనీలు వరంగల్‌కు వచ్చాయని చెప్పారు.